మార్చి 31 డెడ్‌లైన్..
పన్ను ఆదా హడావుడిలో ఈ తప్పులొద్దు..
ఆర్థిక సంవత్సరం ముగియనుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు, పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాలి. చివరి నిమిషంలో ఆందోళన వద్దు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఈపీఎఫ్, పిల్లల ట్యూషన్ ఫీజులు, గృహరుణం అసలు, జీవిత బీమా పాలసీల్లాంటి వాటిని ఇందులో చూపించుకోవచ్చు.
ఇవన్నీ పోను ఇంకా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా చూసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడి పథకాల గురించి ఆలోచించాలి. అవసరం లేకుండా పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు తొందరొద్దు. చాలామంది తక్షణమే పెట్టుబడులకు అవకాశం కల్పించే పథకాలను ఎంచుకుంటారు. ఇవి కొన్నిసార్లు దీర్ఘకాలిక పథకాలు కావొచ్చు. రానున్న ఏళ్లలో ఆదాయం తగ్గితే ఏంటి పరిస్థితి?
పెట్టుబడులను ఎంచుకునేటప్పుడు నష్టభయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈఎల్‌ఎస్‌ఎస్ తరహా ఫండ్లలో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ సిప్ ద్వారా మదుపు చేయడం మంచిది.
సెక్షన్ 80సీ పరిమితిని పూర్తి చేసుకునేందుకు సురక్షితంగా ఉంటూ, రాబడికి హామీ ఉన్న పథకాలనూ పరిశీలించవచ్చు. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలాంటివి ఉంటాయి.
జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్)ను ఎంచుకోవడం ద్వారా అదనంగా పన్ను మినహాయింపు పొందేందుకు వీలుంది.
సెక్షన్ 80సీలో రూ.1,50,000 పరిమితి మించిన తర్వాత.. రూ.50వేలు ఎన్‌పీఎస్‌లో మదుపు చేయొచ్చు