#eenadu
ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా? ప్రకృతిని తలపిస్తున్నట్లుగా ఈ అక్షరాలను క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే.. నేడు ధరిత్రి దినోత్సవం. ఈ సందర్భంగా గూగుల్ క్రియేట్ చేసిన ఈ డూడుల్ అందరినీ ఆకర్షిస్తోంది.
‘G O O G L E’ అక్షరాలను సరిగ్గా గమనిస్తే ఇందులో వివిధ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలు భూమిపైన ఉన్నవే.. వాటిని పరిరక్షించేందుకు వివిధ సంస్థలు, స్థానికులు కలిసి చేస్తున్న కృషిని గుర్తిస్తూ గూగుల్ ఈ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.
G
ఇంగ్లీషులో ‘జీ’ని పోలి ఉన్న మొదటి ఫొటోలోని ప్రదేశం టర్క్స్ అండ్ కైకోస్ దీవులు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతం అంతరించిపోతున్న అనేక జీవులకు రక్షణగా,జీవ వైవిధ్యానికి కేంద్రంగా నిలుస్తోంది.
O
మెక్సికోలోని స్కార్పియన్ రీఫ్ నేషనల్ పార్క్. యునెస్కో గుర్తింపు పొందిన ఈ జీవావరణ ప్రాంతం పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందింది. అంతరించిపోతున్న అనేక పక్షులు, తాబేళ్లు ఇక్కడ కనిపిస్తాయి.
O
ఐస్‌లాండ్‌లోని వట్నాజోకుల్ నేషనల్ పార్క్‌కు సంబంధించిన ఫొటో ఇది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.. అగ్నిపర్వతాలు, మంచుతో కూడిన అరుదైన ప్రకృతి దృశ్యాలు, వృక్షజాలానికి నెలవు.
g
ఇది బ్రెజిల్‌లోని జౌ నేషనల్ పార్క్. అమెజాన్ అడవుల మధ్యలోని ఈ ప్రాంతం అనేక అరుదైన జంతువులకు నివాసం. చూసేందుకు కూడా ఆకుపచ్చగా ఎంతో ఆహ్లాదంగా ఉంది కదూ!
l
‘ఎల్’ను సూచిస్తున్న ఈ ప్రాంతం నైజీరియాలోని గ్రేట్ గ్రీన్‌వాల్. ఎడారిగా మారి ఈ ప్రాంతం కోల్పోయిన వైభవాన్ని మొక్కలు నాటడం ద్వారా పునరుద్ధరిస్తున్నారు. ఇది స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది.
e
ఆస్ట్రేలియాలోని పిల్బరా ఐలాండ్స్ నేచర్ రిజర్వ్స్‌కు చెందిన ఫొటో ‘ఈ’ అక్షరాన్ని పోలి ఉంది. ఇక్కడ అనేక సముద్ర తాబేళ్లు, పక్షులు సహా పలు అరుదైన జీవజాతులు సంచరిస్తాయి.