పుస్తక పఠనం.. ఇలా అలవాటు చేసుకోండి!
పుస్తకాలు చదవడమనేది ఎంతో మంచి అలవాటు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, పద సంపద పెరుగుతుంది. మనుషుల వ్యక్తిత్వాలు, సమాజం, వివిధ అంశాల పట్ల అవగాహన వస్తుంది. అందుకే పుస్తకాలు చదివేవాళ్లు జీవితాన్ని బాగా అర్థం చేసుకోగలరని పెద్దలంటారు.
Image:Pixabay
కానీ, ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పుస్తకాలు చదవడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. కొందరు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలనుకుంటున్నా ఎక్కువ రోజులు పుస్తకాలను చదవలేకపోతున్నారు. పుస్తక పఠనంపై ఆసక్తి ఉన్నవాళ్లు దాన్ని అలవాటుగా మార్చుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.
Image:RKC
మొదట మీకు నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాన్ని మాత్రమే ఎంపిక చేసుకోండి. దీంతో చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీకు తెలియకుండానే దాంట్లో లీనమవుతారు. అలా క్రమంగా పుస్తక పఠనం అలవాటుగా మారిపోతుంది.
Image:Pixabay
పుస్తక పఠనం కోసం కాస్త సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. ఇందుకోసం ప్రత్యేకించి మీ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. రోజుకు కనీసం పది నిమిషాలు చదివినా చాలు. అలాగే, ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎంచక్కా ఒక పుస్తకం వెంట తీసుకెళ్లండి.
Image:RKC
చదవడం ప్రారంభించిన మొదట్లోనే ఎక్కువ పేజీలు ఉన్న పెద్ద పుస్తకాన్ని ఎంచుకుంటే.. అది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. ఇన్ని పేజీలు ఎప్పుడు చదవాలి? అసలు చదవగలనా? వంటి సందేహాలు వస్తాయి. కాబట్టి, తక్కువ పేజీలుండే పుస్తకాలు ఎంచుకోండి.
Image:Pixabay
కొంతమంది పుస్తకాలు చదువుతూ నచ్చిన అంశాన్ని, వాక్యాలను నోట్స్‌లో రాసుకుంటారు. నిజానికి ఇది మంచి విషయమే. కానీ, ఇప్పుడిప్పుడే పుస్తక పఠనం అలవాటు చేసుకునే వారు నోట్స్ రాసే ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే నోట్స్ రాసుకోవడం చదువుకు అంతరాయంగా అనిపిస్తుండొచ్చు.
Image:RKC
మీకు నచ్చిన పుస్తకంలో ఎక్కువ పేజీలు ఉన్నాయనుకుంటే.. రోజుకు 10 పేజీలు చదవండి. సాధారణంగా అరగంటలో సులువుగా 10 పేజీలు చదవొచ్చు. కాబట్టి, రోజుకు 10 పేజీల చొప్పున చదివినా మీరు పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో మీకంటూ ఓ స్పష్టత వస్తుంది.
Image:RKC
పుస్తకాన్ని ఏకకాలంలో పూర్తి చేయాలి.. లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలన్నీ తొందరగా చదివేయాలనే పెద్ద లక్ష్యాలను పెట్టుకోకండి. పుస్తకం పఠనం అలవాటయ్యే వరకు రోజుకు కొంత సమయం చదువుతూ.. నెలలో కనీసం ఒకటి రెండు పుస్తకాలైనా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
Image:Pixabay
మనలో చాలామంది ప్రతి రోజూ కాలక్షేపం కోసం టీవీ చూడటం, ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడటం, సోషల్‌మీడియా చెక్ చేయడం, బ్రౌజింగ్ వంటివి చేస్తుంటారు. వీటి వల్ల సమయమే తెలియదు. అందుకే వీటికి కేటాయించే సమయంలో కొంత పుస్తకం చదవడానికి కేటాయించడానికి ప్రయత్నించండి.
Image:Pixabay