రేపటి ఆనందం కోసం ఈ ఆర్థిక చిట్కాలు..

చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరగానే.. సంపాదించేది ఖర్చు చేసేందుకే అనుకుంటున్నారు. రేపటి కోసం కాస్త ఆలోచిస్తే.. దాచుకుంటూ ఉంటే ఆనందం తెలుస్తుంది. దీన్ని సొంతం చేసుకునేందుకు పాటించాల్సిన చిట్కాలేమిటో తెలుసుకుందాం.

క్రెడిట్‌ కార్డు రెండు వైపులా పదునున్న కత్తి. చాలామంది అధికంగా ఖర్చు చేయడానికి ఇది ఒక కారణం. ఒకవేళ దీన్ని వాడినా, ఒకేసారి బిల్లు మొత్తం చెల్లించండి.

ఆదాయం, ఖర్చులను నిర్వహించేందుకు ఒక బడ్జెట్‌ ఉండాలి. ఇప్పుడు ఎన్నో యాప్‌లు ఇందుకోసం ఉన్నాయి. వివరాలను రెండు మూడు నెలలపాటు నమోదు చేస్తే చాలు. వాటిని విశ్లేషించుకుంటే స్పష్టత వస్తుంది.

మీ ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నష్టభయం ఉన్న పథకాల్లో కాకుండా.. సురక్షిత పథకాల్లో మదుపు చేయండి.

అత్యవసర నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఊహించని ఖర్చుల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది. కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపోయే మొత్తం అత్యవసర నిధిగా ఉండాలి.

ఇతర రూపాల్లో డబ్బు వచ్చినప్పుడు దాన్ని దీర్ఘకాలిక పథకాల్లోకి వ్యూహాత్మకంగా మళ్లించాలి. లేదా రుణాలను చెల్లించడం, అత్యవసర నిధికి ఉపయోగించుకోవడం లాంటివి పాటించాలి.

మీ సంపాదనలో 2-4 శాతానికి మించకుండా మీకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకోవచ్చు. తగ్గించుకున్నా పెద్దగా ఇబ్బందేమీ లేదు.

ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ కోసం ప్రణాళికలు వేసుకుంటేనే.. భవిష్యత్తులో భరోసాగా ఉండగలం అని గుర్తుంచుకోండి.

అప్పులతో జాగ్రత్త. ఆస్తులు సృష్టించని అప్పులు ముప్పే. వ్యక్తిగత రుణాలను తీసుకునే ముందు ఆలోచించండి. పాత రుణాలను తీర్చేందుకు మళ్లీ కొత్త రుణాలు తీసుకోవద్దు.

ఈఎంఐల మొత్తం మీ ఆదాయంలో 30 శాతానికి మించకుండా ఉండాలి. మీ రుణ భారాన్ని సాధ్యమైనంత వరకూ తక్కువగా ఉండేలా చూసుకోండి.

మీ వార్షికాదాయానికి 12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తీసుకోవాలి. కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమా ఉండాలి.

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home