ఒంటరితనాన్ని జయిద్దామిలా..
ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతోన్న సమస్య ఒంటరితనం. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు కొందరు. దీన్ని అధిగమించేందుకు నిపుణులు ఇస్తున్న సలహాలివే..!
ఒంటరితనంతో బాధపడేవారు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సమయానికి తిండీ, నిద్ర మానేసి ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు.
ఇతర ఆరోగ్య సమస్యలకన్నా ఒంటరితనం మనిషిని మరింత కుంగదీస్తుంది. దీంతో గుండెపోటు, డయాబెటిస్, క్యాన్సర్ వచ్చే అవకాశాలూ ఉన్నాయి.
హాబీలను ఏర్పరచుకోవాలి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వంట చేయడం వల్ల ఒంటరితనం నుంచి కాస్త సాంత్వన కలుగుతుంది.
ఒంటరితనం నుంచి బయటపడేందుకు.. బంధువులను, స్నేహితులను తరచూ కలుస్తూ ఉండాలి. మధుర స్మృతులను నెమరువేసుకుంటే చాలు మనసంతా ఉల్లాసంగా ఉంటుంది.
పెంపుడు జంతువుల సంరక్షణ చూసుకోవడం, మొక్కలు పెంచడం వంటివి చేయాలి. దీని వల్ల ఒంటరితనం దూరమవ్వడమే కాకుండా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
ఒంటరితనం, ఒత్తిడి, ఆందోళనకు కారణమయ్యే వాటిల్లో సోషల్ మీడియా ఒకటి. కొద్ది రోజులు సోషల్ మీడియా యాప్‌లను దూరం పెట్టి చూస్తే తేడా మీరే గమనిస్తారు.
రోజూ వ్యాయామం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మనసు, శరీరం ఉత్సాహంగా ఉంటాయి.
కొందరు ఒంటరిగా అనిపిస్తే చాలు మద్యానికి బానిసైపోతారు. ఇది అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.