కళాత్మకమైన ముగ్గు..

విజ్ఞానదాయకం కూడా!

తెలుగింటి పెద్ద పండగ సంక్రాంతి వేడుకల్లో రంగవల్లిక మరింత ప్రత్యేకం. ధనుర్మాసం ప్రారంభంతోనే ఈ సందడి మొదలవుతుంది. ఇంటి ముంగిట వేసే ఈ ముత్యాల ముగ్గులో శాస్త్రం, సంప్రదాయం కలగలసి ఉంటాయి.

ఇంటి ముందు వేసే ముగ్గు లక్ష్మీదేవికి ఆహ్వానం. ప్రకృతి సహజీవనానికి సూచిక కూడా. ముగ్గు పిండిలోని బియ్యప్పిండి చీమలకూ పక్షులకూ ఆహారం. కొన్ని జీవులకైనా ఆహారాన్ని ఇస్తే పుణ్యం దక్కుతుందనే నమ్మికగా ముగ్గు వేస్తారని ప్రతీతి.

ముగ్గు ఎలా ప్రారంభమైందనే విషయంలో శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసి ముగ్గుల రూపంలో నేల మీద చిత్రించారట. అప్పటి నుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టి ముగ్గులు వేస్తారని చెబుతారు.

కళాత్మకమైన ముగ్గు... విజ్ఞానదాయకం కూడా. తీరుగా పెట్టే చుక్కలు లెక్కలపట్ల ఆసక్తిని పెంచితే... కలపడం వల్ల గణితం తేలికగా అర్థమవుతుందట. చుక్కలు అంక గణితమైతే, వాటిని కలపడం సమితులు.

శరీరాన్నీ మనసునూ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ వేసే ముగ్గు ఏకాగ్రతను పెంచే దివ్యమైన మెడిటేషన్‌. ముగ్గు కోసం చాలాసార్లు వంగి లేవాల్సి ఉంటుంది. ఈ భంగిమలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

ఎంత పెద్ద ముగ్గు వేసినా మర్నాటికల్లా దాన్ని తుడిచి మరో ముగ్గు వేస్తారు. ఇది పుట్టుక, పునర్జన్మలకు సూచన అని చెబుతారు. 

ధనుర్మాసంలో వేసే మెలికల పాములు హేమంతంలో కొంకర్లు తిరిగే చలికి సంకేతం. 

ముగ్గు ఉన్న ఇల్లు సకల సౌభాగ్యాలతో కళకళలాడుతుందని విశ్వాసం. రంగవల్లికలు పవిత్రరేఖలు. వాటిని దాటడానికి దుష్టశక్తులు భయపడతాయంటారు. 

చుక్కలు, గీతలు, పువ్వులు, మెలికలు... ఇలా ముగ్గుల్లో బోలెడు రకాలు. ద్రవిడులు చుక్కల ముగ్గులేస్తే, ఆర్యులు గీతల ముగ్గులు వేసేవారట. ఈ రెండింటి సమాహారం మన తెలుగు ముగ్గులు.

వైకుంఠ ఏకాదశి నాడు వేసే ముగ్గులో స్వర్గ ద్వారాలు తెరుచుకున్నట్టు, ఆ ముందు రోజు ముగ్గులో మూసి ఉన్నట్టు వేస్తారు. 

మకర సంక్రమణం రోజు రథం ఇంటిలోకి వస్తున్నట్టు, కనుమ నాడు బయటికి వెళుతున్నట్టు ముగ్గు వేస్తారు.

జుట్టుని ఆరోగ్యంగా ఎదిగేలా చేసే పోషకాహారం..

బద్దకాన్ని వదిలించే టిప్స్‌ చూసేయండి!

పండక్కి ఊరెళ్తే.. జాగ్రత్తలు తప్పనిసరి!

Eenadu.net Home