2100 నాటికి కనుమరుగయ్యే నగరాలివీ!

భూతాపం, వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరం వెంట ఉన్న కొన్ని నగరాలు మునిగిపోతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకారం.. మునిగిపోయే వాటిలో టాప్‌ 10 నగరాలు ఇవే!

జకర్తా, ఇండోనేషియా

భూగర్భజలాలను అధికంగా వినియోగించడం వల్ల ఇండోనేషియా రాజధాని జకర్తా ఏటా 6.7 అంగుళాలు కుంగిపోతోంది. 2050 నాటికే ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలు సముద్రంలో మునిగిపోతాయట. అందుకే, ప్రభుత్వం రాజధానిని మరో చోటుకి మారుస్తోంది. 

లాగోస్‌, నైజీరియా

సముద్రతీరంలో లోతట్టు ప్రాంతం కావడంతో తరచూ భూమి కోతకు గురవుతోంది. రానున్న కాలంలో ఇక్కడి సముద్రమట్టం 3 నుంచి 9 అడుగులు పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. 

హ్యూస్టన్‌, అమెరికా

భూగర్భజలాల అతి వినియోగం కారణంగా ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలు ఏటా 2 అంగుళాలు కుంగుతున్నాయి. దీని ప్రభావంతోనే తరచూ సుడిగాలులు, వరదలు వంటి విపత్తులు ఏర్పడుతున్నాయి. 

వెనీస్‌, ఇటలీ

నీటిపై తేలియాడే నగరంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఏటా 0.08 అంగుళాల మేర మునుగుతోంది. తరచూ ఇబ్బంది పెడుతోన్న వరదలను అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం భారీ బారియర్‌ను నిర్మించింది.

వర్జినీయా బీచ్‌, అమెరికా

సముద్రమట్టం పెరగడం, భూమి కుంగిపోతుండటంతో ఈ నగరం ప్రమాదంలో పడింది. ఈ శతాబ్దం చివరి నాటికి 12 అడుగుల మేర సముద్రమట్టం పెరుగుతుందని పర్యావరణ పరిశోధకులు ఓ నివేదికలో పేర్కొన్నారు. 

బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌.. ఏటా 1 సెం.మీ మేర మునుగుతోంది. 2030నాటికి ఈ నగరం సముద్రమట్టానికి దిగువకు చేరుకుంటుందని పలు పత్రికలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.

న్యూ ఓర్లీన్స్‌, అమెరికా

ఈ నగరంలోని చాలా ప్రాంతాలు ఏటా 2 అంగుళాలు మునుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు సముద్రమట్టానికి దిగువగా ఉన్నాయి. 2100 నాటికి నగరం పూర్తిగా సముద్రంలో కలిసిపోతుందట. 

రోటర్డామ్‌, నెదర్లాండ్స్‌

నగరంలోని దాదాపు 90శాతం ప్రాంతం సముద్ర మట్టానికి దిగువగానే ఉంది. దీంతో తరచూ వరదలు ఈ నగరాన్ని ముంచెత్తుతుంటాయి. ముంపును తట్టుకునేందుకు భారీ రిజర్వాయర్లను నిర్మించారు. 

అలెగ్జాండ్రియా, ఈజిప్ట్‌

సముద్రమట్టం పెరుగుతుండటంతో ఇప్పటికే ఈ ప్రాంతంలోని చాలా బీచ్‌లు కనుమరుగవుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రమట్టం 2 అడుగులు పెరుగుతుందని అంచనా. 

మియామి, అమెరికా

ఇక్కడ సముద్ర మట్టం చాలా వేగంగా పెరుగుతోందట. ఇప్పటికే తరచూ వరదలు, నీటి కాలుష్యంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అతిపెద్ద నగరానికి అతిపెద్ద ముప్పు ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.  

ఫ్యాషన్‌.. ఫుడ్‌.. టూరిజం.. కేరాఫ్‌ అడ్రస్‌ ఇటలీ!

అయితే ఈ చట్టాలు మీకోసమే...

ఈ లక్షణాలు ఉండాల్సిందే..

Eenadu.net Home