డబ్బులు ఊరికే పోవు!
సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేసేందుకు కొత్త కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. కస్టమర్ కేర్, ఓటీపీ, వెబ్ లింక్.. ఇలా కాదేదీ మోసానికి అనర్హం అంటూ డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి కొన్ని సైబర్ మోసాలు ఇవీ..
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకింగ్ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికాడు. అందులో కనిపించిన నంబరుకు ఫోన్ చేస్తే అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు అడిగారు. అంతే ఖాతా ఖాళీ.
పాన్‌కార్డు వివరాలు లింక్ చేయాలంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తున్నారు. ఒకవేళ స్పందిస్తే బ్యాంకు ఖాతాలో మీ సొమ్ము మాయం.
రుణం కావాలా? అంటూ ఇటీవల సైబర్ నేరగాళ్లు కొందరికి ఎర వేస్తున్నారు. ఫోన్ ఎత్తాక ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమంటున్నారు. వారు చెప్పినట్లు చేస్తే రుణం అటుంచితే ఉన్న నగదు మాయం ఖాయం.
క్రెడిట్ కార్డు మంజూరైంది. ఐదు నిమిషాల్లో ప్రాసెస్ చేసి మీకు కార్డు పంపిస్తామంటూ కొందరు లింకులు పంపిస్తున్నారు. లింక్‌లో వారు అడిగిన వివరాలు నింపి ఓ యువకుడు బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోగొట్టుకున్నాడు.
ఓ ఉద్యోగికి ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తక్కువ సమయంలోనే రెట్టింపు నగదు వస్తుందని ఆశపడి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపాడు. రూ.లక్షల్లో నష్టపోయాడు.
మీరు ఆర్డర్ చేసిన వస్తువులు వచ్చాయంటూ ఇ-కామర్స్ ప్రతినిధులుగా సైబర్ నేరగాళ్లు అవతారం ఎత్తుతున్నారు. మీ కోసం వేరెవరో వ్యక్తులు వస్తువు ఆర్డర్ చేశారంటూ ఓటీపీ చెప్పండంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
ఏపీకి చెందిన యువకుడికి ఓ అమ్మాయి వాట్సాప్ వీడియోకాల్ చేసింది. హుషారుగా గొంతు కలిపిన అతడితో తరచూ మాట్లాడింది. ఓ రోజు నగ్నంగా మారమని చెప్పింది. మరుసటి రోజు నుంచే నగ్నంగా కనిపించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి రూ.లక్షల్లో వసూలు చేసింది.
కరెంట్ బిల్లు తక్షణమే చెల్లించండి.. లేదంటే కరెంట్ కట్ అంటూ నకిలీ మెసేజులు వస్తున్నాయి. అందులో లింక్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలా ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 నంబర్‌కు డయల్ చేయండి. cybercrime.gov.in పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు.