వస్తువులు కొనిపించడంలో ‘డార్క్’ సైడ్!
వస్తువులను లేదా సేవలను వినియోగదారులకు బలవంతంగా అంటగట్టేందుకు ఆన్‌లైన్ సంస్థలు ‘డార్క్ ప్యాటర్న్స్’ మార్గాన్ని అనుసరిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వస్తువులు, సేవలు విక్రయించే అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌లు, ప్రకటన సంస్థలు, విక్రయదార్లు డార్క్ ప్యాటర్న్స్‌ను వినియోగించడంపై కేంద్రం నిషేధం విధించింది.
వస్తువులను మనకు అంటగట్టేందుకు ఆయా సంస్థలు ఇన్నాళ్లు వినియోగిస్తున్న ఆ ‘డార్క్’ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం..
బాస్కెట్ స్నీకింగ్
ఏదేని ప్లాట్‌ఫామ్‌లో వస్తువును ఎంపిక చేసి చెల్లింపులు చేసే సమయంలో ఆ వస్తువుకు అదనంగా వస్తువులు, సేవలు, ఛారిటీ చెల్లింపులు, విరాళాలు వంటివి వచ్చి చేరుతుంటాయి. ఎంపిక చేసుకున్న వస్తువు ధరకు మించి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఫోర్స్‌డ్ యాక్షన్
ఒక వస్తువుతో పాటు మరికొన్ని వస్తువులు అదనంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని సృష్టించడం. ఎంపిక చేసుకున్న వస్తువుకు సంబంధం లేని సేవల కోసం సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని సూచించడం.
ఫాల్స్ అర్జెన్సీ
వస్తువు వెంటనే కొనుగోలు చేయకపోతే దొరకదు అనే భయాన్ని వినియోగదారుడిలో నెలకొల్పడం. కౌంట్‌డౌన్ టైమ్ చూపి వస్తువును కొనుగోలు చేసేలా ప్రేరేపించడం.
కన్ఫామ్ షేమింగ్
ఆడియో, వీడియో, పద బంధాల రూపంలో యూజర్‌ను షేమ్ చేయడం. ఇన్సురెన్స్ తీసుకోకపోతే ‘ఫ్యామిలీని రిస్క్‌లో పెడుతున్నారా’ ‘దాతృత్వం పెద్దలకే’ అనే డైలాగులతో యూజర్‌ను కొనుగోలుకు ప్రేరేపించడం
సబ్‌స్క్రిప్షన్ ట్రాప్
ఉచిత సబ్‌స్క్రిప్షన్ పేరుతో ఆటో డెబిట్‌కు వివరాలు సేకరించడం, సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ లేకుండా చేయడం వంటివి ఈ పద్ధతి కిందకు వస్తాయి.
ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్
ఇంటర్‌ఫేస్‌లో మార్పుల ద్వారా వినియోగదారుడిని తప్పుదోవ పట్టించడం. తమకు కావాల్సిన యాక్షన్‌కు మాత్రమే కలర్ ఇచ్చి హైలైట్ చేయడం వంటివి ఈ ప్యాటర్న్ కిందకు వస్తాయి.
బెయిట్ అండ్ స్విచ్
తక్కువ ధరకే వస్తుంది కదా అని వినియోగదారుడు ఆ వస్తువును కొనుగోలు చేయడానికి ప్రయత్నించగానే అది లేదని చూపి.. దాన్ని పోలి ఉన్న మరో ప్రోడక్ట్‌ను అధిక ధరకు అంటగట్టడం
డ్రిప్ ప్రైసింగ్
ఉదాహరణకు విమాన టికెట్ ధరను తొలుత తక్కువగా చూపి.. తీరా పేమెంట్ దగ్గరకు వచ్చే సరికి అధిక ధర చూపించడం అనే పద్ధతిని డ్రిప్ ప్రైసింగ్‌గా వ్యవహరిస్తారు.
న్యాగింగ్
ఏదైనా వెబ్‌సైట్ తమ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని పదే పదే అడగడం, నోటిఫికేషన్లు ఆన్ చేసుకోమని పదే పదే కోరడం వంటివి ఈ పద్ధతి కిందకు వస్తాయి.