విమానం గురించి ఆసక్తికర విషయాలు!
రోజూ వేలాది మంది విమానాల్లో ప్రయాణిస్తారు. తరచూ ప్రయాణించే వారికి కూడా విమానాల గురించి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి.
సాధారణంగా విమానాల్లో ఉండే ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం తీసుకోరు. దీనికంటూ ప్రత్యేక నిబంధనేమీ లేనప్పటికీ.. ఈ సంప్రదాయాన్ని పైలట్లు పాటిస్తున్నారు. ఒకరికి ఏదైనా అసౌకర్యం కలిగినా ఇంకొకరు అందుబాటులో ఉంటారన్నది దీని వెనుక ఉద్దేశం.
ప్రతి 3 వేల గంటలకోసారి ఏదో ఒక విమానాన్ని పిడుగు తాకుతుందట. అయితే, 1967 నుంచి ఇప్పటివరకు పిడుగుపాటు కారణంగా ఏ ఒక్క విమానం కూడా ప్రమాదానికి గురికాకపోవడం గమనార్హం.
విమానాల్లో పొగతాగడం నిషేధం. అయినప్పటికీ టాయిలెట్‌లో పొగతాగేవారి కోసం యాష్‌ట్రేలు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి సిగరెట్లు పట్టుకెళ్లినా ఏదో ఒక మూల పడేసి ప్రమాదానికి కారణం కాకూడదన్న ఉద్దేశంతో దీన్ని ఉంచుతారట
విమానాల్లో మాస్కుల ద్వారా అందించే ఆక్సిజన్ 15 నిమిషాల్లోనే నిండుకుంటుంది. ఆక్సిజన్ అవసరం పడిన సందర్భాల్లో 10 వేల అడుగుల కంటే తక్కువ ఎత్తులోకి విమానాన్ని తీసుకురావడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టదు కాబట్టి!
విమానాల్లో విండో కింది భాగంలో చిన్నపాటి హోల్ ఉంటుంది. క్యాబిన్ లోపల, బయట గాలి ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ హోల్‌ని ఉంచుతారట. ఇది తేమను విడుదల చేయడమే కాకుండా కిటికీపై పొగమంచు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.
విమానం ఎత్తులో ఎగురుతున్నప్పుడు గాల్లో తేమ క్షీణిస్తుంది. దీంతో ప్రయాణికుల్లో వాసనను గుర్తించే శక్తిని కోల్పోతారు. అందుకనే విమానంలో తినే ఆహారం కొందరికి రుచించదు.
రాత్రి వేళల్లో ల్యాండ్ అయ్యేటప్పుడు విమానంలో వెలుతురును కాస్త తగ్గిస్తారు. బయటి వాతావరణానికి అనుగుణంగా ప్రయాణికుల కళ్లు అలవాటు పడాలనే ఇలా చేస్తారట.