లక్షద్వీప్‌లో జల విన్యాసాలు.. మీరూ చేస్తారా? 

ప్రధాని మోదీ పర్యటనతో లక్షద్వీప్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఆయన అక్కడి ప్రకృతిని ఆస్వాదించడమే కాదు.. సముద్రంలో స్నోకెలింగ్‌ (జలవిన్యాసం) చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

దీంతో భారతీయులు విదేశాలకు కాకుండా లక్షద్వీప్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ద్వీపం విశేషాలు, అక్కడి జలవిన్యాసాల గురించి తెలుసుకుందామా?

లక్షద్వీప్‌ అనేది 36 దీవుల సమూహం. ఇది కేరళలోని కొచ్చి తీర ప్రాంతానికి 220 నుంచి 440 కి.మీల దూరంలో ఉంది. అక్కడికి సముద్ర మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అగట్టి ఐలాండ్‌కు విమాన సదుపాయం ఉంది. 

ఈ ద్వీపాల్లో పది మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నాయి. అక్కడి ఆహ్లాదకరమైన బీచ్‌ల్లో సేదతీరడమే కాకుండా.. జల విన్యాసాలూ చేయొచ్చు. అక్కడ అందుబాటులో ఉన్న ఆ జల విన్యాసాలేవంటే..

స్నోకెలింగ్‌

సముద్రం ఉపరితలంపై ఈత కొడుతూ.. లోపలి జీవజాలాన్ని, మొక్కలను చూడొచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన కళ్లద్దాలు, స్నోకెల్‌ అనే చిన్న ట్యూబ్‌ ఇస్తారు. ఆ ట్యూబ్‌ సాయంతో ఊపిరి పీల్చుకోవాలి. బంగారం, కడమట్‌ ఐలాండ్స్‌లో ఈ జల విన్యాసం చేయొచ్చు. 

స్కూబా డైవింగ్‌

ఇది పూర్తిగా సముద్రగర్భంలోకి వెళ్లి వచ్చే విన్యాసం. ఈతగాళ్లు ఊపిరి ఆడటం కోసం ప్రత్యేకమైన ‘బ్రీతింగ్‌ ఎక్విప్‌మెంట్‌’ ధరించి సముద్రంలోకి దూకుతారు. దీనికి శిక్షణ అవసరం. కడమట్‌, కవారతి ఐలాండ్స్‌లో ఈ స్కూబా డైవింగ్‌ చాలా ఫేమస్‌.

లగూన్‌ ఫిషింగ్‌

ఐలాండ్‌లో సహజంగా ఏర్పడిన చిన్న చిన్న సరస్సులను లగూన్‌గా పిలుస్తారు. వీటిలో చేపలు పట్టడాన్నే లగూన్‌ ఫిషింగ్‌ అంటారు. సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో బోట్లలో వెళ్లి, లేదా ఒడ్డునే ఉండి చేపల్ని పడుతుంటారు. ఇలాంటి లగూన్స్‌ కల్‌పెనీ ఐలాండ్‌లో ఎక్కువగా ఉన్నాయి.

సర్ఫింగ్‌

ఇది సర్ఫ్‌బోర్డ్‌ సాయంతో సముద్ర అలలపై చేసే విన్యాసం. సముద్ర తీరమున్న చాలా దేశాల్లో సామాన్యులూ సర్ఫింగ్‌ చేస్తుంటారు. మన దేశంలో పెద్దగా ఫేమస్‌ కాని ఈ విన్యాసాన్ని లక్షద్వీప్‌లోని కడ్‌మట్‌ ఐలాండ్‌లో చేయొచ్చు. ఎందుకంటే.. ఇక్కడ మాత్రమే సముద్ర అలలు స్థిరంగా ఉంటాయట.

కనోయింగ్‌

సన్నగా, పొడవుగా ఉండే బోటులో కూర్చొని.. తెడ్డు సాయంతో ప్రయాణించాలి. సముద్రం లోపలి అందాలు.. స్వచ్ఛమైన గాలి.. ఆ బోటు ప్రయాణం గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఈ కనోయింగ్‌కి మినికోయ్‌ ఐలాండ్‌ పాపులర్‌.

అంతేకాకుండా.. పెడల్‌ బోట్‌, గ్లాస్‌ బాటమ్డ్‌ బోట్‌, సెయిలింగ్‌ బోట్లలోనూ విహరించొచ్చు. వీటన్నింటికీ ప్రత్యేకంగా టూరిస్ట్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వెళ్లానుకుంటే మీకు నచ్చిన ప్యాకేజీని ఎంపిక చేసుకొని ఆస్వాదించొచ్చు.

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home