ఆషాఢ మాసంలో బోనాలు ఎందుకు చేస్తారు..?

ఆషాఢ మాసం వచ్చి రాగానే.. తొలకరి వర్షాలు పడతాయి. వాటితో పాటే అంటువ్యాధులు ప్రబలుతాయి. వీటి నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవార్లకు బోనాలను సమర్పిస్తారు.

శక్తికి ప్రతిరూపం స్త్రీ.. ఆమెనే అమ్మవారికి కొత్తకుండలో పసుపు వేసి అన్నం వండాలి. అలాగే, చిన్న ముంతలో పానకం పోసి.. దానిపైన దీపం పెట్టి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం ఇస్తారు. ఈ బోనాలు తెలంగాణ సంస్కృతిని చాటుతాయి.

గోల్కొండ జగదాంబిక ఆలయంలో తొలుత బోనాల పండగ మొదలవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాలు చేస్తారు. ఆ తర్వాత నగరంలోని అన్నీ అమ్మవారి ఆలయాల్లోనూ బోనాలను అట్టహాసంగా సమర్పిస్తారు.

తెలంగాణలోని అన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఆషాఢం మొత్తం బోనాలు కొనసాగుతాయి. కొన్ని చోట్ల అమ్మవారికి మేకలు, కోళ్లను మొక్కుగా చెల్లిస్తే.. కొన్ని చోట్ల చీరలు, సారెలు మొక్కులుగా సమర్పిస్తారు. 

బోనాలు సమర్పించే సమయంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి పసుపు నీళ్లలో వేపకొమ్మలను ముంచి అమ్మవారికి శాకమిస్తారు. అప్పుడే బెల్లంతో తయారు చేసిన భోజనం సమర్పిస్తారు.

బోనాల పండుగ నాడే అమ్మవారిని కలశంలో ఆవాహనం చేసి అత్తింటి నుంచి పుట్టింటికి వైభవంగా తీసుకొస్తారు. దీన్నే ఘటోత్సవంగా పిలుస్తారు. 

ఇందులో పోతరాజు వేషం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్లు ఒళ్లంతా పసుపు పూసుకొని, ఎర్రధోతి కట్టుకొని, కాళ్లకు గజ్జెలు, చేతిలో కొరడాతో హల్‌చల్‌ చేస్తారు. ఈ సంప్రదాయం దశాబ్దాలుగా వస్తోంది.

బోనాల పండగ తర్వాత అమ్మవారిని ఆవహించిన మహిళ భవిష్యవాణి వినిపిస్తుంది. భవిష్యత్తు గురించి వివరిస్తుంది. ఈమె పలుకు కోసం ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. దీన్నే రంగం అని పిలుస్తారు.

ఆ తర్వాత అమ్మవారిని అత్తింటికి సాగనంపే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తారు. దీంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఆషాఢంలో మొదలయ్యే బోనాలు.. కొన్నిచోట్ల శ్రావణంలోనూ చేస్తుంటారు.

ఆషాఢంలోనే ఇన్ని నియమాలు ఎందుకు పాటిస్తారు..?

జగన్నాథుడి రథయాత్ర విశేషాలివీ!

అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలివీ..

Eenadu.net Home