దేశంలోని ఈ రంగుల నగరాలను చూశారా...?

పింక్‌ సిటీ - జయపూర్‌ (రాజస్థాన్‌)

రాజస్థాన్‌ మహారాజు 1876లో ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌, క్వీన్‌ విక్టోరియాకు స్వాగతం పలికేందుకు నగరమంతా గులాబీ రంగు వేయించాడట. ఇప్పటికీ అనేక భవనాలు గులాబీ రంగులోనే కనిపిస్తుంటాయి. 

బ్లూ సిటీ - జోధ్‌పూర్‌ (రాజస్థాన్‌)

ఇక్కడి ఇళ్లకు నీలిరంగు వేయడానికి రకరకాల కారణాలు చెబుతుంటారు. ఎండ వేడి, కీటకాల నుంచి నీలిరంగు రక్షిస్తుందని ఇళ్లకు ఈ రంగు వేసుకునేవారట. ఇతరుల కంటే భిన్నంగా ఉండేందుకు ఒక వర్గం వారి ఇళ్లకు నీలిరంగు వేసేవారని వాదనలున్నాయి. 

వైట్‌ సిటీ - ఉదయ్‌పూర్‌ (రాజస్థాన్‌)

ఈ ప్రాంతంలో ఒకప్పటి రాజులు.. భవనాలను తెల్లరాతితో నిర్మించారు. ఇప్పటికీ నగరంలోని ఈ కట్టడాలు ఆకట్టుకుంటాయి. అందుకే ఈ నగరాన్ని వైట్‌ సిటీగా పిలుస్తారు. 

ఆరెంజ్‌ సిటీ - నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర)

మహారాష్ట్రలో మూడో అతిపెద్ద నగరమిది. దేశంలోనే అత్యధికంగా కమలాపండ్లను ఇక్కడే పండిస్తారు. దీంతో ఈ నగరాన్ని ఆరెంజ్‌ సిటీగా పిలవడం మొదలుపెట్టారు. 

సిల్వర్‌ సిటీ - కటక్‌ (ఒడిశా)

ఈ నగరం వెండి ఆభరణాలు, కళాకృతుల తయారీకి పెట్టింది పేరు. అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఇక్కడ దాదాపు 2 వేలకు పైగా వెండి తరాకాశి(వెండితో కళాకృతులను తయారీ చేసే వారు)లు ఉన్నారు. 

గోల్డెన్‌/యెల్లో సిటీ - జైసల్మేర్‌ (రాజస్థాన్‌)

ఇది పసుపు-బంగారం రంగులో ఉండే ఎడారి ప్రాంతం. ఇక్కడి ఇసుకతో నిర్మించిన కోటలు, భవనాలు పసుపు/బంగారు రంగును ప్రతిబింబిస్తుంటాయి. 

గ్రీన్‌ సిటీ - తిరువనంతపురం, ఛండీగఢ్‌, భోపాల్‌, మైసూర్‌

దేశంలోని ఈ నగరాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం నిండి ఉంటుంది. కొన్ని ప్రకృతి ప్రసాదిస్తే.. మరికొన్ని ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడ్డాయి. అందుకే, వీటికి ఆ పేరు. 

బ్లాక్‌సిటీ - కోల్‌కతా (పశ్చిమ బెంగాల్‌)

దేశంలోనే అతి పురాతన నగరంగా పేరున్న కోల్‌కతాను బ్లాక్‌ సిటీ అని పిలుస్తారు. ఒకప్పుడు ఎంతోమందిని ఇక్కడి బ్లాక్‌ హోల్‌ జైల్‌లో పెట్టి హింసించారట. అలాగే, వీళ్లు పూజించే కాళీ మాత విగ్రహాలు కూడా నలుపురంగులోనే ఉంటాయి.

ప్రేమతత్వం గురించి చెబుతున్న సద్గురు

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

Eenadu.net Home