చిత్రం చెప్పే విశేషాలు

(08-04-2024/1)

దేహం చుట్టూ ఇంద్రధనస్సులా రంగురంగుల చున్నీలు వేసుకొని ఓ యువకుడు చార్మినార్‌ వద్ద ఎండలో కనిపించాడు. వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా పట్టించుకోకుండా కొనుగోలుదారుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. 

మెరినా బీచ్‌లో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన మార్గం వద్ద 100శాతం పోలింగ్‌పై ఓటర్లకు అవగాహన కల్పించేలా సైకత శిల్పాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్‌ కమిషనరు డాక్టర్‌ జె.రాధాకృష్ణన్, సందర్శకులు వీటిని తిలకించారు. 

మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోని రావిచెట్టు వందల చిలుకలకు నివాసంగా మారింది. వేసవి కావడంతో ఈ వృక్షం ఆకులన్నీరాలిపోయాయి. చెట్టుపైకి చేరిన ఆకుపచ్చ చిలుకలే కొత్త చిగుళ్ల మాదిరిగా కనువిందు చేస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.

ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాల్సి వస్తే వేడి నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుక్కుంటున్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం ముందు నుంచి ఇద్దరు యువతులు ఇలా గొడుగులతో వెళ్తూ కనిపించారు.

పాత పుస్తకాలకు చిరునామా కోఠి, అబిడ్స్‌. ఇక్కడ చిన్న పిల్లల కామిక్స్‌ నుంచి పోటీ పరీక్షల వరకు అన్ని రకాల పుస్తకాలు తక్కువ ధరకే దొరుకుతాయి. ఉద్యోగ ప్రకటనల నేపథ్యంలో వీటికి గిరాకీ పెరిగింది. అబిడ్స్‌ పోస్టాఫీసు సెంటర్‌ వద్ద యువతులు పుస్తకాలు పరిశీలిస్తూ కనిపించారిలా..

రంజాన్‌ మాసం కావడంతో సేమియా అమ్మకాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌ పాత నగరంతోపాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. ఎర్రగడ్డ రహదారిలో ఓ దుకాణం వద్ద సేమియాలు ఆ మార్గంలో వెళ్లేవారి మనసు లాగేస్తున్నాయి.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీంతో మార్కాపురం సమీపం నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్‌ వస్తే చాలు.. పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్లాస్టిక్‌ బిందెలు పట్టుకొని తాగునీరు పట్టుకునేందుకు పోటీపడుతున్నారు.

హనుమకొండ జిల్లా ఐనవోలులోని చారిత్రక శైవక్షేత్రం మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం ఒగ్గు పూజారులు వేసిన ఈ మహా పెద్దపట్నం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 30 మంది ఒగ్గు పూజారులు సుమారు 6 గంటలు శ్రమించి, 50 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో పెద్దపట్నం వేశారు.

కొన్నేళ్లుగా ప్రైవేటు క్యాబ్‌లు సీఎన్‌జీవే ఎక్కువగా ఉంటున్నాయి. కూకట్‌పల్లి - మియాపూర్‌ రోడ్డులో ఓ బంక్‌వద్ద గ్యాస్‌ కోసం బారులు తీరిన వాహనాలివి.

వేసవిలో ప్రయాణాలు చేసేవారు చల్లదనం కోరుకుంటున్నారు. బస్సుల్లో వేడిగాలులతో వడదెబ్బ తగిలే ప్రమాదమూ ఉంటుంది. అందుకే నగర ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. చల్లగా ప్రయాణిస్తూ ఉపశమనం పొందుతున్నారు. 

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నీటి కొరత నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇలాంటి సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ గగన్‌మహల్‌ రోడ్డులో ఓ యువకుడు ఏకంగా పైపుతోనే వాహనాన్ని కడుగుతూ.. నీటిని వృథా చేస్తూ కనిపించాడు. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home