చిత్రం చెప్పే విశేషాలు

(18-03-2024/1)

టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహినితో విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడు నిషాంత్‌తో వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో పెళ్లి జరిపించారు.

 వేసవి కాలం ఇంకా పూర్తి స్థాయిలో రాక ముందే తుంగభద్ర నది దాదాపుగా ఎండిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో ప్రస్తుతం అక్కడక్కడా కన్పిస్తున్న నీరు.. రాబోయే రోజుల్లో కనిపించని పరిస్థితి ఏర్పడనుందని ప్రజలంటున్నారు.

 సిద్దిపేట గ్రామీణ మండలం బండచర్లపల్లి వాసి పోతరాజు యాదగిరి మాత్రం సైకిల్‌పై ప్రయాణిస్తూ సురక్షితంగా ఉండేందుకు శిరస్త్రాణం ధరిస్తుంటారు. రోజూ 20 కి.మీ. దూరాన్ని సైకిల్‌పై ఇలా తిరుగుతానని ఆయన తెలిపారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్న నేపథ్యంలో పుష్కరిణిలో తెప్ప నిర్మాణం పూర్తయింది. తితిదే ఇంజినీరింగ్‌ సిబ్బంది తెప్ప నిర్మాణం పూర్తి చేశారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోందని ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇప్పటికే తెలిపారు.

సిద్దిపేట పట్టణంలోని బ్లాక్‌ ఆఫీస్‌ వద్ద ఓ హోటల్‌ నిర్వాహకులు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బొమ్మ తయారు చేయించి ప్రదర్శనగా పెట్టారు. బొమ్మను చూడగానే అది చాయ్‌ హోటల్‌ అని తెలిసేలా రూపొందించారు. అందరినీ ఆకట్టుకుంటోంది.

కన్నడ పవర్‌ స్టార్, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి ఇంకా అభిమానుల స్మృతిపథం నుంచి తొలగిపోనేలేదు. తమ అభిమాన నటుడు కళ్లముందున్నట్లు అనుభూతి చెందుతున్నారు. ఆదివారం ఆయన జయంతిని పురస్కరించుకుని కొందరు కళాకారులు ఆయన రూపాన్ని రంగోలితో చిత్రించి నివాళి అర్పించారిలా.

భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి పొదుపు చర్యలు పాటించాలని, లేనిపక్షంలో బెంగళూరు దుస్థితే తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఖైరతాబాద్‌ జలమండలి కార్యాలయం వద్ద వేస్తున్న ఈ చిత్రం నీటి పొదుపు ఆవశ్యకతకు అద్దంపడుతోంది.

నిజామాబాద్‌ నగరంలోని ఓ ఇంటి ముందు ఖాళీ స్థలం లేక పోవడంతో బంగ్లాపైనే పచ్చని గడ్డితో పరిచి అందమైన లాన్‌ ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలమొక్కలతో అందంగా అలంకరించడంతో ఆహ్లాదం సంతరించుకుంది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేలా చెన్నై కేకే నగర్‌లోని శివన్‌ పార్కులో ఖాళీ ప్లాస్టిక్‌ సీసాలతో ఏర్పాటు చేసిన గోపురం చూపరులను ఆకట్టుకుంటోంది.

రహదారిపై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల దృష్టి పంటపై పడకుండా ఉండేందుకు ఓ రైతు తన మిర్చి పంటలో శిరస్త్రాణం, కళ్ల జోడు పెట్టి ఓ దిష్టిబొమ్మను ఏర్పాటుచేశాడు. వరంగల్‌ టేకుమట్ల మండలం వెల్లంపల్లి నుంచి ఎంపేడుకు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే మిర్చి పంటలో ఈ దృశ్యం కనిపించింది.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home